ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి . ప్రతి సంవత్సరం 20 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆరు లక్షలకు పైగా క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ,గర్భాశయ ,అండాశయా క్యాన్సర్లు అత్యంత ప్రబలంగా కనిపిస్తున్నాయి .చర్మ క్యాన్సర్లు కూడా ఆడవాళ్లను పట్టిపీడిస్తున్నాయి .అయితే మహిళలు ఉపయోగించే అనేక సౌందర్య ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
అమెరికా లాస్ ఏంజెల్స్ లో నిర్వహించిన ఈ సర్వే వివరాలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ సర్వేలో భాగంగా అమెరికాకు చెందిన 64 మంది మహిళలను ఎంచుకున్నారు. వారు నిత్యం ఉపయోగించే సబ్బులు, లోషన్లు ,షాంపు, కండిషనర్ ,స్కిన్ లైట్నర్, ఐ లైనర్, ఐలాష్ గ్లూ లాంటి దాదాపు 1143 ఉత్పత్తులను పరిశీలించారు .అందులో 53 శాతం మంది ఫార్మాలిడిహైడ లాంటి క్యాన్సర్ కారకాలను విడుదల చేసే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించినట్టు కనుగొన్నారు. అనేక ఉత్పత్తుల్లో ఫార్మాలిడిహైడ్ను విరివిగా వాడుతున్నారని, ఇది క్యాన్సర్ కారకమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని నుంచి విడుదలయ్యే వాయువులు క్యాన్సర్ను కలగజేయడమే కాకుండా శరీరంపై దద్దుర్లు ,జుట్టు, గోర్లపైన ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. వీటిని అలాగే వాడితే దీర్ఘకాలంలో రొమ్ము క్యాన్సర్ తో పాటు గర్భాశయ, అండాశయం క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు .
యూరోపియన్ యూనియన్ 2009లోనే ఫార్మాలిడిహెడ్ ను కాస్మెటిక్ పదార్థంగా నిషేధించిందని పలువురు గుర్తు చేశారు. అయినా అనేక సౌందర్య ఉత్పత్తుల సంస్థలు ఇష్టారాజ్యంగా వీటిని వాడుతున్నాయని చెబుతున్నారు. అయితే ఆయా ఉత్పత్తుల లేబుల్స్ పై ఫార్మల్ డిహైడ్ గురించిన వివరాలు ప్రత్యక్షంగా ఇవ్వడం లేదని చాలా వరకు దాని రసాయనిక పేర్లను వాడుతున్నారని తెలిపారు.
కాబట్టి వినియోగదారులు సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో లేబుల్స్ను క్షుణ్ణంగా చదవాలని సూచిస్తున్నారు .ఏ రకమైన ఉత్పత్తులు అనారోగ్యానికి గురిచేస్తాయో తెలుసుకోవడానికి రసాయన శాస్త్రవేత్తలే కావాల్సిన అవసరం లేదని ,కాస్త అవగాహన ఉంటే చాలని అంటున్నారు. అందంగా ఉండాలని ఆరాటపడుతూ లేనిపోని కొత్త రోగాలు కొని తెచ్చుకోకూడదని సలహాయిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి